మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
TG TET 2027 Syllabus : తెలంగాణ టెట్ సిలబస్ విడుదల - మీ సబ్జెక్ట్ పేపర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Telangana TET Syllabus : తెలంగాణ టెట్ (TG TET) జనవరి సెషన్ - 2027 నోటిఫికేషన్‌కు సంబంధించిన సిలబస్‌ను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షా విధానం, ముఖ్య తేదీలు, సిలబస్ డౌన్‌లోడ్ ప్రక్రియ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
Telangana TET Syllabus : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి సెషన్ - 2027 నోటిఫికేషన్ విడుదలై…. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సిలబస్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు నేరుగా టెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ సబ్జెక్ట్ సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

పరీక్షకు ప్రిపేర్ అయ్యే క్రమంలో కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా… మారిన లేదా తాజా సిలబస్‌పై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం విజయానికి ఎంతో అవసరం. బయట దొరికే అనధికారిక మెటీరియల్ చూసి గందరగోళానికి గురికాకుండా, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచే సిలబస్ కాపీని పొందాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
టీజీ టెట్ సిలబస్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే 'Syllabus' (సిలబస్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మొత్తం 15 పేపర్ల పేర్లు వరుసగా కనిపిస్తాయి.
- మీ సబ్జెక్ట్ పేపర్ పక్కనే ఉండే డౌన్‌లోడ్ ఆప్షన్‌పై నొక్కితే, పీడీఎఫ్ రూపంలో సిలబస్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది.
- అవసరమైతే ప్రింట్ ఆప్షన్ ఉపయోగించి హార్డ్ కాపీని కూడా తీసుకోవచ్చు.
పరీక్షా విధానం ఎలా ఉంటుంది…?
తెలంగాణ టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-1 రాయాలి. అలాగే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లలోనూ 150 మార్కులకు గానూ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది.
జనవరి సెషన్ - 2027 ముఖ్య తేదీలు ఇవే:
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2026
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: డిసెంబర్ 28, 2026 నుంచి
- TG TET పరీక్షల తేదీలు: జనవరి 3, 2027 నుంచి జనవరి 15, 2027 వరకు
- ఫలితాల విడుదల: ఫిబ్రవరి రెండో వారం (ఫిబ్రవరి 8 నుంచి 12, 2027 మధ్యలో)
టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై కావడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 40 శాతం ఆపై మార్కులు సాధించాలి. సందేహాల కోసం పనిదినాల్లో 7093708883, 7093708884, 7093958881, 7093468882 హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించవచ్చు.

E-Paper
