BJP Karimnagar Rally : రాహుల్‌ గాంధీకి రేవంత్ రెడ్డి ఒక 'ఏటీఎం' - బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఫైర్

Nitin Nabin Karimnagar rally : రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీ (ఓట్ చోరీ) జరిగిందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక 'ఏటీఎం' లా పనిచేస్తున్నారని  ఆరోపించారు.

Published on: Nov 23, 2026, 16:33:11 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nitin Nabin Rally in Karimnagar : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ…. ఓట్ల చోరీ (ఓట్ చోరీ) జరిగిందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రజలు, ఓట్లు రెండూ బీజేపీ వెంటే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసలు ఓటర్ల జాబితాలో చొరబాటుదారుల పేర్లను చేర్చాలని వకాల్తా పుచ్చుకుంటున్నారని నితిన్ నబీన్ ఆరోపించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ( ఫైల్ ఫొటో) (HT_PRINT)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ( ఫైల్ ఫొటో) (HT_PRINT)

రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు…

దేశంలో 13 కోట్ల మంది ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ చేస్తున్న వాదనను నితిన్ నబీన్ తప్పుబట్టారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న విమర్శలకు పలు గణాంకాలతో బదులిచ్చారు.

"దేశంలో 13 కోట్ల మంది ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ జీ అంటున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను.. అసలు ఆ 3 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితాలో ఎందుకు చేర్చాలి….? దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లారు. తెలంగాణలోనూ లక్షలాది మంది తమ ఓట్లను మార్చుకున్న విషయం నాకు తెలుసు. అలాంటప్పుడు ఒకే వ్యక్తిని రెండు చోట్ల ఓటు వేయడానికి అనుమతించాలా….? ఇక మిగిలిన 3 కోట్ల మంది విషయానికి వస్తే.. 2003లో ఎన్నికల సంఘం వారి ఆచూకీపై విచారణ జరిపినప్పుడు వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఇలాంటి 3 కోట్ల మంది చొరబాటుదారుల కోసం వకాల్తా పుచ్చుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు….. రాహుల్ గాంధీయే" అని నితిన్ నబీన్ ఆరోపించారు.

కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన సభ కంటే కరీంనగర్ సభకు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున జనాన్ని సమీకరించారని ఆయన వ్యాఖ్యానించారు.

"ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ జీ పదేపదే చెబుతుంటారు. రాహుల్ జీ.. ప్రజలు మాతో ఉన్నారు, ఓట్లు మాతోనే ఉన్నాయి. కరీంనగర్ ప్రజలు తమ ఆశీర్వాదం మాకేనని నిరూపించారు. ఇండియా కూటమి నేతలు తమ శక్తియుక్తులన్నీ ధారబోసినా కనీసం ఒక్క రాంలీలా మైదానాన్ని కూడా నింపలేకపోయారు. కానీ బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రాంలీలా మైదానంలో పట్టే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది ప్రజలను సమీకరించారు" అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం ప్రతిని పట్టుకుని తిరుగుతుండటంపై నితిన్ నబీన్ విమర్శలు చేశారు. దేశంలో అరాచకం సృష్టించాలని చూసే వారి కుట్రలను సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు.

"రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగే వారికి నేను ఒకటే చెప్పడానికి వచ్చాను.. మీ చేతుల్లో రాజ్యాంగం కాపీ మాత్రమే ఉంది, కానీ మా గుండెల్లో రాజ్యాంగం ఉంది. మీరు రాజ్యాంగం గురించి కేవలం మాట్లాడతారు, మేము దానిని ఆరాధిస్తాము. అందుకే మేము అన్ని రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తాము," అని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి ఒక ఏటీఎం…

కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు సొంత జిల్లా అని గుర్తుచేసిన నితిన్ నబీన్…. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పీవీకి కాంగ్రెస్ నాయకత్వం తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపైనా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక ‘ఏటీఎం’లా పనిచేస్తున్నారని నితిన్ నబీన్ ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, రాష్ట్రంలో తదుపరి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"తెలంగాణ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని నేను కచ్చితంగా చెబుతున్నాను. బీజేపీ కార్యకర్తలు ఇకపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. 2014లో భారత ప్రజలు ప్రధాని మోదీకి తీర్పు ఇచ్చారు, ఆయన దేశ సేవకు అంకితమైన సేవకుడిగా మారారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సేవకుడు అనే భావన ఎప్పటికీ అర్థం కాదు. వారికి రాజకీయం అంటే అధికారం, హోదా మాత్రమే. అధికారాన్ని వారు కేవలం దోచుకోవడానికి ఒక మార్గంగా చూస్తారు. కానీ బీజేపీకి అధికారం అనేది ప్రజాసేవకు ఒక సాధనం మాత్రమే, వ్యక్తిగత లాభం కోసం కాదు" అని ఆయన అన్నారు.

వచ్చే 2029 ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. "మోదీ జీ ఎక్కడికీ వెళ్లరు… 2029లోనూ ఆయన మళ్లీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాహుల్ జీ.. మీరు కలలు కంటూనే ఉండండి. భారతదేశ యువత, రైతులు, మహిళలు, కార్మికులు, సమాజంలోని ప్రతి వర్గం ప్రధాని మోదీ వెంటే నిలబడి ఉంద," అని నితిన్ నబీన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.