మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
తెలంగాణ నీటి హక్కులపై మరణశాసనం రాశారు - కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్, ఏపీ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు
కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పల్నాడు వాటర్ గ్రిడ్, పోతిరెడ్డిపాడు అనుమతుల వెనుక కేసీఆర్, హరీశ్‌రావు పాత్ర ఉందని ఆయన విమర్శించారు.
కృష్ణా జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దోచిపెడుతోందంటూ బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాలను మళ్లించుకుపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు…?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. "కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే, ఆయనకు, అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న సమయంలోనే 2022లో పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో వచ్చింది. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తూ, 2024లోపు పూర్తి చేయాలని జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం దీనికి సాయం చేస్తున్నా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దగ్గర గానీ, జల జీవన్ మిషన్‌లో గానీ కేసీఆర్ ఏనాడూ ఒక్క అభ్యంతరం కూడా తెలపలేదు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఈ అంశం తమ దృష్టికి రాగానే వెంటనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారని సీఎం రేవంత్ వివరించారు.
హరీశ్ పై సీఎం ఫైర్…
మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన సమయంలో తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని హరీశ్‌రావు చెబుతున్న మాటల్లో నిజం లేదని సీఎం వ్యాఖ్యానించారు.
"2005 సెప్టెంబర్‌లో జీవో 170 వచ్చే సమయానికి తాను మంత్రిగా లేనని హరీశ్ రావు అంటున్నారు. కానీ, 2005 మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే పోతిరెడ్డిపాడుకు నిధులు కేటాయించారు. క్యాబినెట్ ఆమోదం తర్వాతే బడ్జెట్లో నిధులు పెడతారు. ఆ బడ్జెట్ ఆమోదం పొందేనాటికి హరీశ్‌రావుతో పాటు ఐదుగురు అప్పటి తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారు. వార్డు మెంబర్‌గా కూడా లేని హరీశ్‌రావును నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిని చేశారు. ఆ కృతజ్ఞతతో, గురుదక్షిణగా పోతిరెడ్డిపాడుకు, హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీటి తరలింపునకు హరీశ్‌రావు అనుమతులు ఇచ్చారు. ఆయనకు అసలైన గురువు కేసీఆర్ కాదు, వైఎస్ఆర్," అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2005లో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
కృష్ణా జలాల వాటాపై 2015, 2020 సంవత్సరాల్లో జరిగిన ఒప్పందాలపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 575 నుంచి 578 టీఎంసీల నీళ్లు రావాలి. పాత ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది వాటాలపై మాట్లాడుకునే వెసులుబాటు ఉండేది. కానీ 2015 జూన్ 26న కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ సంతకాలు చేశారు. ఆ తర్వాత 2020 జనవరి 29న ఏపీకి శాశ్వతంగా 512 టీఎంసీలు వెళ్లేలా మరోసారి సంతకం చేసి తెలంగాణ నీటి హక్కులపై మరణ శాసనం రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల దోపిడీని ఆపే శక్తి లేకపోతే…. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎందుకు అడ్డుకోలేకపోయారు….?" అని సీఎం ప్రశ్నించారు.
ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు….?
గత ప్రభుత్వ హయాంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. "2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 119 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటే, మా ప్రభుత్వం వచ్చాక 2024-25లో 285 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాం. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, అచ్చంపేట, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను పదేళ్ల పాటు పక్కన పెట్టారు. రూ.2.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పదేళ్ల పాలనలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై కేసీఆర్ కేవలం రూ.11,255 కోట్లు, భూ నిర్వాసితుల కోసం రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ మేము మూడేళ్లలోనే రూ.6,767 కోట్లు ఖర్చు చేశాం. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? పదేళ్లలో మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి" అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వేసే రాజకీయ ఉచ్చులో తాము పడబోమని….. 20 ఏళ్ల జల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటామని…. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయమై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని రెండుసార్లు కలిసి విన్నవించామని ఆయన తెలిపారు.

E-Paper
