మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
మెడికల్ కాలేజీల PPP ముసుగులో భారీ స్కామ్ - ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఇది ప్రజాధనం దోపిడీ అని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించామని…. అందులో 5 కాలేజీలను ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతుల నిర్వహణకు సిద్ధం చేశామని జగన్ గుర్తుచేశారు. మిగిలిన 9 కాలేజీల నిర్మాణానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు కేటాయిస్తే అవి కూడా పూర్తయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఎకరా రూ. 100కే లీజుకు ఇవ్వడం, సగానికి పైగా మెడికల్ సీట్లను ప్రైవేటు వారు అమ్ముకునేందుకు అవకాశం కల్పించడం అన్యాయమని మండిపడ్డారు.
దీనికి తోడు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పేరుతో రూ. 1,630 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా, కాలేజీల్లో పనిచేసే డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కో కాలేజీకి నెలకు రూ. 5 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం భరించడం దోపిడీ కాక మరేమిటని ఆయన నిలదీశారు. భూములు, భవనాలు, జీతాలు అన్నీ ప్రభుత్వానివే అయినప్పుడు ప్రైవేటు సంస్థలకు పెత్తనం అప్పగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలన్నీ టీచింగ్ ఆస్పత్రులతో కూడినవని… వీటి నిర్వహణకు పటిష్టమైన ఆర్థిక నమూనాను రూపొందించామని జగన్ తెలిపారు. సగం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తూ, మిగిలిన సీట్లను ప్రైవేటు కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులో ఉంచడం ద్వారా వచ్చే ఆదాయంతో కాలేజీలను స్వయం సమృద్ధిగా నడిపేలా బ్యాంకులతో లింకేజీ చేశామని వివరించారు. జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌ను ఈ మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయడం వల్ల గ్రామస్థాయి వరకు నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందుతుందని పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య రంగం తీరుపై విమర్శలు
ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందని జగన్ ఆరోపించారు. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని…. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ. 3,000 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో అవి సేవలు నిలిపివేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తమ హయాంలో జీరో వేకెన్సీ పాలసీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల ఖాళీలను 4 శాతానికి తగ్గించామని, ఇప్పుడు మళ్లీ ఖాళీలు పెరుగుతున్నాయని ఆక్షేపించారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయని, 108, 104 వాహనాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో కోటి మంది ప్రజలు సంతకాలు చేసి నిరసన తెలిపినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమని జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

E-Paper
